
కోనసీమ, అక్టోబరు 2(శ్రీ విష్ణు న్యూస్): దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా గురువారం అమలాపురం పట్టణ పరిసర గ్రామాల్లో దుర్గమ్మ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. విజయదశమిని పురస్కరించుకుని ఆలయాల్లో మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. చండీ హోమాలు జరిపించారు. అమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో కొలువై ఉన్న శ్రీవైష్ణవీ కనకదుర్గమ్మ, శ్రీదేవి మార్కెట్ సెంటర్ లోని శ్రీదేవి అమ్మవారు, హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ కళ్యాణదుర్గమ్మ, ఈదరపల్లి వంతెన వద్ద శ్రీదుర్గా భవానీ అమ్మవారు, మెయిన్ రోడ్డులోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయాల్లో అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవిగా విశేష అలంకారం చేయించారు. ఆయా ఆలయాల వద్ద శమీ పూజలు నిర్వహించారు. దసరా చివరి రోజు కావడంతో అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు ఆలయాల వద్ద బారులు తీరారు.
