HomeAndhra Pradeshతెలంగాణ ఆర్టీసీకి సంక్రాంతి.. దోపిడీకి సిద్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు

తెలంగాణ ఆర్టీసీకి సంక్రాంతి.. దోపిడీకి సిద్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు

, Publish Date -

తెలుగు వారి పండుగ సంక్రాంతి. తెలంగాణ వారికి అది పెద్ద పండుగే కాదు. కానీ ఈసారి సంక్రాంతి తెలంగాణ ఆర్టీసీకి మరింత కలిసొచ్చింది. సంక్రాంతి పండుగ కోసం కోనసీమలోని అమలాపురం ఆర్టీసీ డిపోకు 20 బస్సు సర్వీసులను ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ ఆన్ లైన్లో ఉంచింది.

APSRTC Bus
APSRTC Bus

తెలుగు వారి పండుగ సంక్రాంతి. తెలంగాణ వారికి అది పెద్ద పండుగే కాదు. కానీ ఈసారి సంక్రాంతి తెలంగాణ ఆర్టీసీకి మరింత కలిసొచ్చింది. సంక్రాంతి పండుగ కోసం కోనసీమలోని అమలాపురం ఆర్టీసీ డిపోకు 20 బస్సు సర్వీసులను ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ ఆన్ లైన్లో ఉంచింది. ప్రయాణికుల రద్దీని బట్టి గతంలో మాదిరిగానే సిటీ బస్సులను కూడా రంగంలోకి దింపే అవకాశం ఉందంటున్నారు. తెలంగాణలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార, చదువుల నిమిత్తం వెళ్లి స్థిరపడ్డ తెలుగువారు ఎందరో. వారంతా సంక్రాంతి పండుగకు కోనసీమతో పాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందేలు, ప్రభల తీర్థాలను తిలకించేందుకు ముందస్తు ప్రణాళికలు వేసుకుంటారు. హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి గోదావరి జిల్లాలకు వచ్చి వెళ్లాలంటే ముందుగా రైళ్లు, బస్సులకు రిజర్వేషన్లు చేయించుకోవాల్సిన పరిస్థితి.

ఇప్పటికే రైల్వే టిక్కెట్లు నిండుకున్నాయి. ఇక మిగిలింది ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్ బస్సులు. చిత్రం ఏమిటంటే ఈసారి హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి ఉభయ గోదావరి జిల్లాల వారిని తీసుకు వచ్చి తీసుకువెళ్ళేలా తెలంగాణ ఆర్టీసీ ముందంజలో ఉంది. ఇదిలా ఉండగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించింది. ఈ పథకం అమలులోకి రాక ముందు ఆర్టీసీ ప్రయాణికుల ఆక్యుపెన్సీ రేషియో 50 శాతం మాత్రమే ఉండేది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో అది కాస్తా 100 నుంచి 120 శాతానికి పెరిగిపోయింది. ప్రయాణికుల సంఖ్య రెట్టింపు అయ్యింది కానీ ఒక్క కొత్త బస్సును కూడా ఇంత వరకూ పెంచలేదు. ఈ పరిస్థితుల్లో సంక్రాంతికి ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు వేసే పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని అధికారులే చెబుతున్నారు.

సంక్రాంతిలో ఉచిత బస్సు ప్రయాణాలు తగ్గితేనే..

జిల్లా కేంద్రమైన అమలాపురం ఆర్టీసీ డిపోలో 100 బస్సులు ఉండగా 70 బస్సులు స్త్రీ శక్తి పథకానికి ఉచితంగా కేటాయించారు. ఇక మిగిలిన వాటిలో రోజుకు 12 బస్సు సర్వీసులను హైదరాబాద్ పంపిస్తున్నారు. సంక్రాంతి సీజన్ లోనూ ఇవే సర్వీసులు కొనసాగుతాయి. ఇక సంక్రాంతి పండుగలకు పాఠశాల, కళాశాలలకు సెలవులు ఉన్నందున విద్యార్థుల బస్సు ప్రయాణాలు ఉండవు. అయితే ఉచిత మహిళా ప్రయాణికుల సంఖ్య కూడా తగ్గితే హైదరాబాద్ కు ప్రత్యేక సర్వీసులు తిప్పగలమని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో బస్సులు రోజువారీ షెడ్యూల్ లో స్వల్ప మార్పులు చేసినా బస్సు డిపోల్లో గంటల తరబడి నిలబడిపోయే ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. వాటన్నింటినీ బేరీజు వేసుకుని హైదరాబాద్ కు ప్రత్యేక బస్సుల ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. గత ఏడాది జిల్లాలోని ఒక్క అమలాపురం డిపో నుంచే అదనంగా 10 బస్సు సర్వీసులను హైదరాబాద్ కు నడిపారు. ఈ సారి అదనపు సర్వీసులపై ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో ఆర్టీసీ అధికారులు ఉన్నారు.

రెండు రెట్లు టికెట్ల ధరలు పెంచినా పట్టించుకునేవారేరి..

TGSRTC Bus
TGSRTC Bus

అమలాపురం నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సు టిక్కెట్టు ధర రూ.900 మాత్రమే. ఇక ప్రైవేటు ట్రావెల్ బస్సులు ఇప్పటికే ప్రారంభించిన ఆన్లైన్ విక్రయాల్లో టిక్కెట్టు ధర రూ.1500 నుంచి రూ.3వేల వరకూ పలుకుతుంది. పండుగ దగ్గరకు వచ్చేసరికి ఈ ధరలు మరింత పెరుగుతాయంటున్నారు. ప్రైవేటు ట్రావెల్ బస్సులు ఆన్లైన్ లో బహిరంగంగా అడ్వాన్స్ బుకింగ్ తెరచి దోపిడీని ప్రారంభించారు. ఇదంతా ఆన్లైన్ లో బహిరంగంగా జరుగుతున్నా పట్టించుకునే అధికారే లేడు. ఇక ఇదే అదునుగా తెలంగాణ ఆర్టీసీ డైలీ సర్వీసులకు టిక్కెట్ ధర రూ.1100 కాగా ప్రత్యేక సర్వీసులకు ప్రత్యేక ధరను ప్రకటించింది.

ఈ టిక్కెట్టు ధరలు కూడా సమయానుకూలంగా మారిపోతున్నాయి. ఏపీఎస్ ఆర్టీసీలో ప్రయాణించే వారిని ఆఫ్ టిక్కెట్లు, సీనియర్ సిటిజెన్, విశ్రాంత ఉద్యోగులకు ప్రత్యేక రాయితీలు వర్తిస్తాయి. హైదరాబాద్ కు ప్రత్యేక బస్సు సర్వీసులను వేసినా ఇవే నిబంధనలు వర్తిస్తాయి. అయితే ప్రైవేటు ట్రావెల్ బస్సుల్లో ఇవేమీ వర్తించవు. దాంతొ ఏపీఎస్ ఆర్టీసీ ప్రజా రవాణా సంస్థ గానే ఓ వైపు ఆదాయంతోనే హైదరాబాద్ బస్సు సర్వీసులను పండుగ సీజన్ లోనూ నడపనుంది. సంక్రాంతి నాటికైనా ప్రభుత్వం కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు.