ఆరోగ్యంతో పాటు బహుళ ప్రయోజనాలు పొందే విధంగా అమలాపురం రూరల్ మండలం వన్నెచింతలపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు రూపొందించిన ప్రాజెక్టు జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రజా స్పందన ప్రాజెక్టు అవార్డును దక్కించుకుంది.

కోనసీమ, నవంబరు 23(శ్రీ విష్ణు న్యూస్): ఆరోగ్యంతో పాటు బహుళ ప్రయోజనాలు పొందే విధంగా అమలాపురం రూరల్ మండలం వన్నెచింతలపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు రూపొందించిన ప్రాజెక్టు జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రజా స్పందన ప్రాజెక్టు అవార్డును దక్కించుకుంది. పాఠశాలకు చెందిన విద్యార్థినులు సోరపల్లి శశివదన, ఉండ్రాజవరపు భవ్యశ్రీలు ఆరోగ్యం కోసం ఇంట్లో సైక్లింగ్ చేసే విధానాలను దగ్గరగా పరిశీలించారు. సైక్లింగ్ తో ఆరోగ్యంతో పాటు బహుళ ప్రయోజనాలు పొందే విధంగా సృజనాత్మకంగా ఆలోచించారు. వారికి గైడ్ టీచర్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గుబ్బల నాగ సత్యనారాయణ వైజ్ఞానిక ఆలోచనలను అందించారు. దాంతో ఆ విద్యార్థినులు మల్టీ పర్పస్ సైక్లింగ్ మిల్లును శాస్త్రీయంగా తయారు చేశారు. మండల స్థాయి పోటీల నుంచి ఈ ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపిక కావడంతో పాటు ఉత్తమ అవార్డును దక్కించుకోవడం విశేషం.

సైకిల్ తొక్కుతూ విద్యుత్ ఉత్పత్తి..
మల్టీ పర్పస్ సైక్లింగ్ మిల్లు సైకిల్ తొక్కడంతోనే ప్రారంభం అవుతుంది. దానికి అమర్చిన ప్రత్యేక పరికరాలతో ఒకే సమయంలో మరెన్నో లాభాలు పొందవచ్చునని శశివదన, భవ్యశ్రీలు వివరించారు. ఇంట్లో సైక్లింగ్ చేయడం ద్వారా విద్యుత్ ఉత్పత్తిని చేయవచ్చు. తద్వారా ఏక కాలంలో మిల్లులా పనిచేస్తుంది. ధాన్యం, ఇసుక, పిండి జల్లిస్తుంది. మరోవైపు గ్రైండింగ్ పనులు కూడా ఏ విధంగా చేసుకో వచ్చునో ప్రయోగ పూర్వకంగా వివరించి జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాజెక్టు రూపకర్తలుగా నిలిచారు.
భోపాల్ లో ప్రదర్శన..
మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో 52వ రాష్ట్రీయ బాలల వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. ఈ నెల 18 నుంచి 23 వరకూ ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనను కేంద్ర విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లాని, మధ్యప్రదేశ్ రాష్ట్రయువజన సేవలు, క్రీడా శాఖా మంత్రి విశ్వాస కైలాస్ సారంగ తదితర ప్రముఖులు విద్యావేత్తలు సందర్శించారు. రాష్ట్రం నుంచి ఆరు ప్రాజెక్టులను జాతీయ స్థాయి పోటీలకు వెళ్లగా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన మల్టీ పర్పస్ సైక్లింగ్ మిల్లు ప్రాజెక్టు ఉత్తమ ప్రజా స్పందన ప్రాజెక్ట్ అవార్డును దక్కించుకుని ప్రముఖుల చేతుల మీదుగా అందుకున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఏర్పడిన తరువాత సైన్స్ విభాగంలో వరుసగా తొమ్మిదవ నేషనల్ అవార్డును దక్కించుకున్నట్టు జిల్లా సైన్స్ అధికారి జీవీఎస్ సుబ్రహ్మణ్యం తెలిపారు. జాతీయ స్థాయిలో సత్తా చాటిన విద్యార్థినులు, నైపుణ్యాలను పెంపొందించిన ఉపాధ్యాయులను జిల్లా విద్యా శాఖాధికారి డాక్టర్ షేక్ సలీమ్ భాషా, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ జి. మమ్మీ, జిల్లా ఉప విద్యాశాఖాధికారులు గుబ్బల సూర్య ప్రకాశం, పి. రామ లక్ష్మణమూర్తి, డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు కార్యదర్శి బీర. హనుమంతరావు, సైన్స్ అధికారి జీవీఎస్ సుబ్రహ్మణ్యం తదితరులు ప్రత్యేకంగా అభినందించారు.
Read Latest AP News And Telugu News
