
కోనసీమ, అక్టోబరు 3(శ్రీ విష్ణు న్యూస్): రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో పథకం పేరిట ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల కోసం ప్రతి ఏటా రూ. 15 వేలు ఆర్థిక సహాయం ప్రకటించిందని ఈ మేరకు ఈ నెల 4వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులను ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో నేరుగా ఆటో డ్రైవర్ల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ నుండి మండల స్థాయి వరకు ఎంపీడీవోలు, తాసిల్దార్లు, మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆటో డ్రైవర్ల సేవలో పథకం విధివిధానాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 7, 709 మందికి రూ. 15 వేలు చొప్పున లబ్ధి పొందనున్నాన్నారని వివరించారు. ఈ సాయం ప్రధానంగా వాహన నిర్వహణ ఖర్చులు, బీమా, రిపేర్, ఫిట్నెస్ వంటి అవసరాలకు ఉపయోగించు కోవచ్చునన్నారు. డ్రైవర్ అదే వాహనం యజమాని అయి ఉండాలని, వాహనం ఆంధ్రప్రదేశ్లో రిజిస్టర్ అయి ఉండాలన్నారు. జిల్లాలో మొత్తం రూ 11 కోట్ల, 56 లక్షల 35 వేల మేర ఆర్థిక సహాయం డ్రైవర్లకు అందుతుందని కలెక్టర్ తెలిపారు. జిల్లాస్థాయిలో కలెక్టరేట్ లోని గోదావరి భవన్లో ఆటో డ్రైవర్ల సేవా పథకం 4వ తేదీ శనివారం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు, జిఎస్డబ్ల్యూఎస్ కోఆర్డినేటర్ సువిజయ్ తదితరులు పాల్గొన్నారు.
