బంగారం ప్రస్తావన లేకుండా ఏ శుభ కార్యక్రమం పూర్తి కాని రోజులివి. ఇక వివాహ సమయాల్లో అయితే బంగారు ఆభరణాలకు ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. బంగారు ఆభరణాలతో హుందాతనాన్ని ప్రదర్శించే రోజులివి. గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు ఆకాశంలో చుక్కలనే దాటి పోయింది. రెండేళ్ల వ్యవధిలో రెట్టింపు అయిన బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందా అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ ఏడాది వివాహాది శుభ ముహూర్తాలకు ఇక రెండు రోజులే మిగిలి ఉంది. ఆ తరువాత 83 రోజుల పాటు శుక్ర మౌఢ్యం కావడంతో వివాహాది శుభ కార్యక్రమాలకు ముహూర్తాలు ఉండవు. దాంతో ఆ సమయంలోనైనా బంగారం ధరలు దిగి వస్తాయన్న ఆశా భావంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఎదురు చూస్తున్నారు. పెరుగుట విరుగుట కొరకే అన్న సామెత బంగారానికి వర్తిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.
బంగారం ధరలు దిగి వచ్చేనా..

శుక్ర మౌఢ్యం కారణంగా వివాహాది శుభ కార్యక్రమాలకు సుమారు మూడు నెలల పాటు బ్రేక్ పడిన నేపధ్యంలో బంగారం ధరలు తగ్గ వచ్చునని వ్యాపారులు సైతం ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది మే నెల నుంచి బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతుండడంతో వ్యాపారం అంతంత మాత్రంగానే ఉంటుందని చిరు బంగారు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కార్పొరేట్ దుకాణాల తాకిడికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న సాధారణ వ్యాపారులకు ధరల పెరుగుదల గోరు చుట్టుపై రోకటి పోటుగా మారింది. దానికి తోడు బడా వ్యాపార సంస్థలు బంగారం కొనుగోళ్లపై సైతం ఆఫర్లు ప్రకటించి చిరు వ్యాపారులకు కొద్ది పాటి వ్యాపారం కూడా లేకుండా చేస్తున్నారని కొందరు వాపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది బంగారం ధరలు చుక్కలనంటాయి.
- 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 1.35 లక్షలకు పెరిగింది.
- 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1.21 లక్షలకు పెరిగింది.
- ప్రస్తుతం బంగారం ధరల్లో ఎగుడు దిగుడులు కొనసాగుతూ కాస్తంత తగ్గాయంతే.
- ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 1.30 లక్షల వద్ద ఉంది.
- 2023 నవంబరు నెలలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 60 వేలు ఉండగా, ఈ ఏడాది ఇదే నెలలో రూ. 1.30 లక్షల్లో ప్రస్తుతం ఉంది.
- అప్పట్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 55,400 కాగా ప్రస్తుతం రూ. 1.15 లక్షల వద్ద ఉంది.
రానున్న శుక్ర మౌఢ్యంలోనైనా బంగారం ధరలకు కళ్ళెం పడుతుందని అన్ని వర్గాల ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి నాటికి బంగారం ధరలు దిగిరావొచ్చునని భావిస్తున్నారు.
ఈ నెల 26 నుంచి శుక్ర మౌఢ్యం.. కాలెపు భీమేశ్వరరావు సిద్ధాంతి, ఈశ్వర పంచాంగ కర్త, బండారులంక.
ఈ నెల 26 నుంచి శుక్ర మౌఢ్యం ప్రారంభం అవుతుంది. ఈ నెల 21 నుంచి డిసెంబరు 19 వరకూ మార్గశిర మాసం. ఈ మాసంలో శంకుస్థాపనలు, గృహ ప్రవేశాలకు ముహూర్తాలు లేవు. ఈ నెల 22, 23 తేదీల్లో వివాహాలకు ముహూర్తాలు ఉన్నాయి. ఈ నెల 26 నుంచి శుక్ర మౌఢ్యం ప్రారంభం అయ్యి 2026 ఫిబ్రవరి 17 వరకూ ఉంది. దాంతో 83 రోజుల పాటు శుక్ర మౌఢ్యంలో వివాహాది శుభ ముహూర్తాలు ఉండవు.
గమనిక: పైన పేర్కొన్న బంగారం ధరలు మార్కెట్లో ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. కాబట్టి కొనుగోలుదారులు ఆ సమయంలో మరోసారి ధరలు పరిశీలించాలని సూచించడమైనది.
