అలనాటి అపురూప గ్రీటింగ్ కార్డులు ఏమైపోయాయి. అందమైన అక్షరమాలికల కూర్పుతో ప్రకృతి రమణీయతను ప్రతిబింబించిన అద్భుత చిత్రాలు ఏమైపోయాయి. ప్రేమికులు, స్నేహితులు, బంధువులు.. ఇలా ఎవరి బంధానికి వారు తమ అనుబంధాన్ని పెంచుకునేలా చేసిన గ్రీటింగ్ కార్డులు చూద్దామంటేనే కనిపించడం లేదు.

అలనాటి అపురూప గ్రీటింగ్ కార్డులు ఏమైపోయాయి. అందమైన అక్షరమాలికల కూర్పుతో ప్రకృతి రమణీయతను ప్రతిబింబించిన అద్భుత చిత్రాలు ఏమైపోయాయి. ప్రేమికులు, స్నేహితులు, బంధువులు.. ఇలా ఎవరి బంధానికి వారు తమ అనుబంధాన్ని పెంచుకునేలా చేసిన గ్రీటింగ్ కార్డులు చూద్దామంటేనే కనిపించడం లేదు. కొత్త సంవత్సరం వస్తుందంటే చాలు నెల రోజులు ముందుగానే గ్రీటింగ్ కార్డుల సందడి మొదలయ్యేది.
దూరంగా ఉన్నవారికి గ్రీటింగ్స్ చెప్పేందుకు తపాలా శాఖ ఎంతగానో ఉపయోగపడేది. ఎక్కడ పడితే అక్కడ రోడ్ల పక్కన గ్రీటింగ్ కార్డుల అమ్మకాలకు ప్రత్యేక స్టాల్స్ వేసేవారు. పాఠశాలకు వెళ్ళే విద్యార్థుల నుంచి పెద్దల వరకూ తమ అనుబంధాన్ని తెలియచేస్తూ ముద్రించిన గ్రీటింగ్ కార్డుల కోసం వెతుకులాడుతూ కనిపించే వారు. అమలాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం.. ఇలా ఏ ప్రాంతంలో నైనా సినిమా రోడ్లు మాత్రమే కాదు అన్ని వీధుల్లో దారి పొడవునా గ్రీటింగ్ కార్డుల దుకాణాలు ఉండేవి. గ్రీటింగ్ కార్డులే కనుమరుగైపోతే నేడు షాపులు ఎక్కడ ఉంటాయి.
అమూల్యంగా దాచుకున్న వారెందరో..
దశాబ్దాల కాలం క్రితం అందుకున్న గ్రీటింగ్ కార్డులను నేటికీ అమూల్యంగా భద్రపరచుకున్న వారు ఎందరో ఉన్నారు. అలనాటి గ్రీటింగ్ కార్డులను అప్పుడప్పుడు చూసుకుంటూ మురిసిపోయే పెద్దలు కూడా ఉన్నారు. స్నేహితులకైనా, ప్రేమికులకైనా, బంధువులకైనా నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు గ్రీటింగ్ కార్డుల ద్వారా తమ అంతరంగాన్ని పంచుకునేవారు. తొలినాళ్లలో అయితే సినీ తారల గ్రీటింగ్ గ్రీటింగ్ కార్డులకు మంచి క్రేజ్ ఉండేది. తమ అభిమాన హీరో హీరోయిన్ల చిత్రాలతో ఉన్న గ్రీటింగ్ కార్డులను ఎక్కువగా కొనుగోలు చేసేవారు.
కాల క్రమంలో ప్రకృతి రమణీయ దృశ్యాలు, ప్రసిద్ది చెందిన ఆలయాలు, ప్రపంచ వింతలు, ప్రేమ చిహ్నాలు, ప్రేమను పెంచే పుష్పాలు ఇలా ఒక్కటేమిటి మతాలకు అతీతంగా దేవుళ్ల చిత్రాలతో రక రకాల గ్రీటింగ్ కార్డులు అందుబాటులోకి వచ్చాయి. అందమైన గ్రీటింగ్ కార్డుల్లో ఆలోచింపచేసే, ప్రేమను పంచే కొటేషన్లు చూసుకుని మురిసిపోయే వారు. అటువంటి గ్రీటింగ్ కార్డులను అందుకున్న వారి ఆనందానికి అవధులు ఉండేవి కావు. అందుకే ఆయా కార్డులను అమూల్యంగా భావించి పది కాలాల పాటు భద్ర పరుచుకునేవారు. అటువంటి గ్రీటింగ్ కార్డుల గురించి కొత్త జనరేషన్ కు తెలియాలంటే అదో చరిత్ర గానే ఉంటుంది.
సోషల్ మీడియాదే హడావుడి..
కాలం మారింది. కనుమరుగైన గ్రీటింగ్స్ కార్డుల స్తానాన్ని సోషల్ మీడియా ఆక్రమించుకుంది. దూరంగా ఉన్నవారిని దగ్గర చేసింది. దగ్గరగా ఉన్న వారికి దూరం చేసింది చేతిలోని సెల్ ఫోన్. అరచేతిలో ఇమిడిపోయిన సెల్ ఫోన్ ద్వారానే నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకునే రోజులొచ్చాయి. బంధం ఏదైనా తమ అనుబంధాన్ని, అంతరంగాన్ని వాట్సాప్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లోనే ఆవిష్కరిస్తున్నారు. ఎంత దూరంలో ఉన్నవారికైనా వీడియో కాల్ చేసి మరీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. కానీ అలనాటి గ్రీటింగ్ కార్డుల అనుభూతిని పొందలేక పోతున్నారు. అందుకేనేమో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది.
