జనవరి 12న విడుదల కానున్న మెగాస్టార్ నటించిన మన శంకరవరప్రసాద్ గారు చిత్రం ప్రీమియర్ షో మొదటి టిక్కెట్ వేలం పాట మంగళవారం అమలాపురం వెంకటరమణ ధియేటర్ ఆవరణలో నిర్వహించారు.

కోనసీమ, జనవరి 6(శ్రీ విష్ణు న్యూస్): జనవరి 12న విడుదల కానున్న మెగాస్టార్ నటించిన మన శంకరవరప్రసాద్ గారు చిత్రం ప్రీమియర్ షో మొదటి టిక్కెట్ వేలం పాట మంగళవారం అమలాపురం వెంకటరమణ ధియేటర్ ఆవరణలో నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.1,11,000 కు మొదటి టిక్కెట్ ను బీజేపీ సీనియర్ నాయకుడు మోకా వెంకట సుబ్బారావు దక్కించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 కేంద్రాల్లో మాత్రమే తొలి టిక్కెట్ కు వేలం నిర్వహించేందుకు అనుమతి లభించింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అమలాపురానికి మాత్రమే ఈ అవకాశం దక్కింది. గతంలో పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఓజి చిత్రానికి అదే విధంగా వేలం పాట నిర్వహించారు. అప్పట్లో మొదటి టిక్కెట్ ను రూ.64 వేలకు ఓ అభిమాని దక్కించుకున్నారు. ఈసారి జరిగిన వేలం పాట రూ.9 వేలతో ప్రారంభించారు. చివరకు రూ.1.11 లక్షలకు మెగా అభిమాని మోకా వెంకట సుబ్బారావు దక్కించుకున్నారు. స్వయంకృషితో ఎదిగిన చిరంజీవి తెలుగు సినిమా రంగంలో సుప్రీం హీరో స్థాయి నుంచి మెగాస్టార్ గా ఎదిగారని ఆయన పేర్కొన్నారు. మెగా అభిమానులు నల్లా చిట్టిబాబు, ఏడిద శ్రీను, నల్లా నాయుడు ఆధ్వర్యంలో జరిగిన వేలంలో మెగా అభిమానులు పాల్గొన్నారు. కార్యక్రమంలో నల్లా పవన్ కుమార్, కంచిపల్లి అబ్బులు, కల్వకులను తాతాజీ తదితరులు పాల్గొని సుబ్బారావును అభినందించారు.
