రాష్ట్ర వ్యాప్తంగా పశు సంపదను వృద్ధి చేయడంతో పాటు పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు ఏపీ పశుగణాభివృద్ధి సంస్థ ముఖ్య కార్య నిర్వహణాధికారి డాక్టర్ ఎం. శ్రీనివాసరావు తెలిపారు.

కోనసీమ, నవంబరు 25(శ్రీ విష్ణు న్యూస్): రాష్ట్ర వ్యాప్తంగా పశు సంపదను వృద్ధి చేయడంతో పాటు పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు ఏపీ పశుగణాభివృద్ధి సంస్థ ముఖ్య కార్య నిర్వహణాధికారి డాక్టర్ ఎం. శ్రీనివాసరావు తెలిపారు. రైతులకు రెట్టింపు ఆదాయాన్ని పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్రంలో 50 లక్షల వరకూ ఎదకు వచ్చే సామర్థ్యం ఉన్న పాడి పశువులు ఉన్నాయి. వాటిలో 2030 నాటికి సుమారు 30 లక్షల పాడి పశువులకు ఎద ఇంజెక్షన్లు చేయడం లక్ష్యంగా నిర్దేశించామన్నారు. అమలాపురం రూరల్ మండలం ఏ. వేమవరం గ్రామంలో మంగళవారం జరిగిన ఉచిత పశు వైద్య శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఏటా 10 లక్షల పెయ్య దూడల ఉత్పత్తి లక్ష్యం..
వికసిత భారత్ లో భాగంగా పాడి సంపద వృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆధ్వర్యంలో ఏటా 10 లక్షల పశువుల్లో పునరుత్పత్తి చేసే ప్రత్యేక కార్యక్రమం చేపట్టాం. ముఖ్యమంత్రి చంద్రబాబు, జిల్లా ఇంచార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం అమలు చేస్తున్నామన్నారు. ఏటా 10 లక్షల చొప్పున పెయ్య దూడలను ఉత్పత్తి చేస్తూ 2030 నాటికి సుమారు 30 లక్షల పెయ్య దూడలను ఉత్పత్తి చేయడం లక్ష్యం అన్నారు. పాడి పశువుల్లో నూటికి 92 శాతం పెయ్య దూడలు పుట్టే విధంగా శాస్త్రీయంగా రూపొందించిన సెమన్ అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.
రూ. 150 కే పెయ్య దూడను పుట్టించే సెమన్..
పెయ్య దూడలను పుట్టించే సెమన్ ఖరీదు రూ. 300 కాగా 50 శాతం రాయితీపై పాడి రైతులకు రూ. 150 కే అందుబాటులోకి తీసుకువచ్చామని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం రెండు రకాల సెమన్ లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ పరంగా విశాఖపట్నం, నంద్యాల, కర్నూలులో మూడు సెమన్ స్టేషన్లు ఉన్నాయి. వాటితో పాటు నేషనల్ డైరీ డెవలప్ మెంట్ బోర్డు సహకారంతో పెయ్య దూడలను ఉత్పత్తి చేసే సెమన్ అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 2 లక్షల పశువులకు పెయ్య దూడలను ఉత్పత్తి చేసే సెమన్ వేయడం జరిగిందని 92 శాతం సత్ఫలితాలను ఇచ్చిందని శ్రీనివాసరావు తెలిపారు. పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పెయ్య దూడల ఉత్పత్తిని పెంచుకుని ఆర్థిక పురోభివృద్ధినిని సాధించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పశు సంవర్ధకశాఖ జిల్లా అధికారి డాక్టర్ డి. వెంకట్రావు, సహాయ సంచాలకులు డాక్టర్ ఎల్ విజయారెడ్డి, చీకట్ల వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Read Latest AP News And Telugu News
