రాష్ట్రంలోని నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. నిరుద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. దీనిలో భాగంగా ఇప్పటికే కౌశలం సర్వే నిర్వహించి నిరుద్యోగుల వివరాలను సచివాలయాల వారీగా సేకరించింది.

కోనసీమ, నవంబరు 30(శ్రీ విష్ణు న్యూస్): రాష్ట్రంలోని నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. నిరుద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. దీనిలో భాగంగా ఇప్పటికే కౌశలం సర్వే నిర్వహించి నిరుద్యోగుల వివరాలను సచివాలయాల వారీగా సేకరించింది. పదో తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీ, ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసిన అభ్యర్థుల జాబితాలు సిద్ధం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి సాఫ్ట్వేర్ సంస్థలు, మల్టీ నేషనల్ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఈ నేపధ్యంలో ఇంజనీరింగ్, ఉన్నత చదువులు చదివిన వారు ఏదో ఒక కంపెనీలో ఉద్యోగ అవకాశం వస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు.
ట్రయల్ రన్ సక్సెస్..
నిరుద్యోగ అభ్యర్థులకు సచివాలయాల వారీగా ప్రభుత్వం ఆన్ లైన్ పరీక్షలు నిర్వహించనుంది. దీనిలో భాగంగా ఇప్పటికే పురపాలక సంఘాల్లోని వార్డు సచివాలయాలు, గ్రామాల్లోని గ్రామ సచివాలయాలకు వెబ్ కెమెరాలు, హెడ్ సెట్లను ప్రభుత్వం సరఫరా చేసింది. అంతే కాకుండా పరీక్షల నిర్వహణ సజావుగా నిర్వహించేందుకు రెండు రోజుల పాటు ట్రయల్ రన్ నిర్వహించింది. మారుమూల, ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా సజావుగా ట్రయిల్ పరీక్షలు పూర్తి కావడంతో డిసెంబరు 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఒక్కో సచివాలయంలో రోజుకు ఇద్దరు చొప్పున..
రాష్ట్రంలోని ఒక్కో సచివాలయంలో రోజుకు ఇద్దరు చొప్పున నిరుద్యోగ అభ్యర్థులకు ఆన్ లైన్ పరీక్షలు నిర్వహిస్తారు. ఆయా అభ్యర్థులకు ముందస్తుగానే సమాచారం అందిస్తారు. సచివాలయాల పని దినాల్లో ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకూ ఆన్ లైన్ పరీక్ష నిర్వహిస్తారు. సదరు అభ్యర్థులు నిర్ధేశిత సమయం కంటే పావుగంట ముందుగా ఆ పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి.
మూడు నెలలు పాటు ఆన్లైన్ పరీక్షలు..
ఒక్కో సచివాలయంలో రోజుకు ఇద్దరు మాత్రమే పరీక్షకు హాజరయ్యే పరిస్థితి. దాంతో సుమారు మూడు నెలలు పాటు ఆన్లైన్ పరీక్షలు జరుగుతాయని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.
కోనసీమ జిల్లాలో 81,370 మంది అభ్యర్థులు..
వర్క్ ఫ్రమ్ హోమ్ పరీక్షకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి 81,370 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. వీరంతా కౌశలం సర్వేలో నమోదు అయిన వారే. జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాలు 515 ఉన్నాయి. అంటే ఒక్కో సచివాలయంలో రోజుకు ఇద్దరు చొప్పున 1030 మంది ఆన్ లైన్ పరీక్షకు హాజరు అవుతారు. అంటే ప్రభుత్వ సెలవు దినాలు, పండుగలు అన్నీ కలుపుకుంటే మూడు నెలలకు పైగానే వీరందరికీ ఆన్లైన్ పరీక్ష రాసేందుకు సమయం పడుతుంది. ఏది ఏమైనా నిరుద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే అటు కంపెనీలకు, ఇటు నిరుద్యోగులకు మేలు చేకూరినట్టే.
Read Latest AP News And Telugu News
