ఆటో డ్రైవర్లకు భరోసా కల్పిస్తూ కూటమి ప్రభుత్వం వాహనమిత్ర పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆటో, క్యాబ్ వాహన యజమానులే డ్రైవర్లుగా ఉన్నవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. వాహనమిత్ర పథకం కింద ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున అందించనున్నారు.

కోనసీమ, అక్టోబరు 1(శ్రీ విష్ణు న్యూస్): ఆటో డ్రైవర్లకు భరోసా కల్పిస్తూ కూటమి ప్రభుత్వం వాహనమిత్ర పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆటో, క్యాబ్ వాహన యజమానులే డ్రైవర్లుగా ఉన్నవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. వాహనమిత్ర పథకం కింద ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున అందించనున్నారు. ఇప్పటికే అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలోని సచివాలయాల వారిగా ఆటో, క్యాబ్ డ్రైవర్లు నుంచి 8,516 దరఖాస్తులను స్వీకరించారు.
అమలాపురం మండలంలో అత్యధికంగా..
వాహన మిత్ర పథకం కింద జిల్లా వ్యాప్తంగా 8,516 దరఖాస్తులు అందాయి. వాటిలో అత్యధికంగా అమలాపురం రూరల్ మండలం నుంచి 514 దరఖాస్తులు అందాయి. ఆ తరువాత కొత్తపేట మండలంలో 461, రావులపాలెంలో 446, ఆత్రేయపురంలో 413, పి. గన్నవరంలో 404 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అత్యల్పంగా ముమ్మిడివరం అర్బన్ లో 131, అమలాపురం అర్బన్ లో 185 మంది దరఖాస్తు చేసుకున్నారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నుంచి ఊరట..
కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల అమలులో భాగంగా స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు. దాంతో తాము ఉపాధిని కోల్పోయామని ఆటో డ్రైవర్లు దశలవారి ఆందోళనకు దిగారు. తక్షణం స్పందించిన ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీ మేరకు వాహనమిత్ర పథకాన్ని ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించింది. దాంతో మహిళల ఉచిత బస్సు ప్రయాణంతో ఉపశమనం పొందిన ఆటో డ్రైవర్లు ఆందోళన విరమించారు.
పారదర్శకంగా వాహనమిత్ర..
జిల్లాలో వాహనమిత్ర పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు. దాంతో సచివాలయ సిబ్బంది లాగిన్ లోకి వచ్చిన ఆన్ లైన్ దరఖాస్తులను పరిశీలించి ఈకేవైసీ ప్రక్రియను సైతం పూర్తి చేశారు. జిల్లాలోని మండల పరిషత్ కార్యాలయాల ద్వారా కలెక్టర్ ఆమోదానికి 8,516 దరఖాస్తులు చేరుకున్నాయి. వాటిని పరిశీలించి ఆమోదిస్తే ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున ప్రభుత్వం అందించనుంది. దసరా కానుకగా అక్టోబర్ 4న వాహనమిత్ర పథకాన్ని అమలు చేసే అవకాశం ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం రూ.10 వేలు చొప్పున అందించగా చంద్రబాబు ప్రభుత్వం రూ.15 వేలు చొప్పున అందించనుండడంతో ఆటో డ్రైవర్ల ఆనందానికి అవధులు లేవు.
ఆటో డ్రైవర్లు అందరికీ వర్తింప చేయాలి: వాసంశెట్టి సత్తిరాజు, ఆటో యూనియన్ జిల్లా శాఖ అధ్యక్షుడు
జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 16,500 ఆటోలు ఉన్నాయి. తొలివిడత వాహన మిత్ర పథకం సగం మందికే వర్తించే పరిస్థితి. ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోయినా వర్తింప చేస్తామన్నారు. ఇప్పుడేమో ఆపేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. ఎఫ్ సీ లేకపోయినా వర్తింప చేయాలి. ప్రభుత్వం ఇచ్చే గడువు లోగా ఎఫ్ సీ సమర్పిస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కోనసీమ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయుధ పూజ: ఎస్పీ రాహుల్ మీనా
సమస్యల పరిష్కారానికై.. ఫ్యాప్టో పోరుబాట: ఫ్యాప్టో రాష్ట్ర ఛైర్మెన్ లంకలపల్లి సాయిశ్రీనివాస్
Read Latest AP News and Telugu News
