
కోనసీమ, అక్టోబరు 1(శ్రీ విష్ణు న్యూస్): అంధుల కోసం ప్రత్యేకంగా పాఠశాల నిర్మించాలనేది దశాబ్దాల కాలం నాటి కల. వివిధ జిల్లాలకు చెందిన ఎందరో అంధులను సంఘటిత పరిచి తొలుత అద్దె భవనంలో శ్రీనివాసరావు ప్రిన్సిపాల్ గా లూయీ అంధుల పాఠశాలను ప్రారంభించారు. నడిపూడిలోని డాబా గార్డెన్స్ లో అప్పటి అమలాపురం ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి లూయీ అంధుల పాఠశాలను ప్రారంభించారు. వారికోసం ప్రత్యేకంగా భవనం నిర్మించాలని ఆయన ఎంతగానో పరితపించారు.
ఎంపీ హరీష్ బాలయోగి కృషితో..
దశాబ్దాల కాలం అనంతరం ఎట్టకేలకు లూయీ అంధుల పాఠశాల కల సాకారం అయ్యింది. జిల్లా కేంద్రమైన అమలాపురంలో అంధుల పాఠశాల నిర్మాణానికి ఎంపీ గంటి హరీష్ బాలయోగి ఎంపీ లాడ్స్ నిధులతో పాటు సిఎస్ఆర్ నిధులు రూ. 60 లక్షలు కేటాయించారు. పంచాయతీరాజ్ ప్రాజెక్ట్స్ డిప్యూటీ ఇంజనీర్ అన్యం రాంబాబు పర్యవేక్షణలో సుందర వనంగా అంధుల పాఠశాల భవనాన్ని నిర్మించారు.
అట్టహాసంగా ప్రారంభం..
లూయీ అంధుల పాఠశాలను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ప్రభుత్వ విప్ దాట్ల. సుబ్బరాజు, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ తో కలిసి ఎంపీ హరీష్ బాలయోగి ప్రారంభించారు. అంధుల ఆశ్రమ పాఠశాలలోని వివిధ విభాగాలను నాయకులు ప్రారంభించారు. అత్యాధునికంగా భవనాన్ని నిర్మించిన పంచాయతీ రాజ్ డీఈఈ అన్యం రాంబాబు, సిబ్బందిని పలువురు అభినందించారు. ఎంపీ హరీష్ బాలయోగితో పాటు భవన నిర్మాణానికి కృషిచేసిన ప్రతి ఒక్కరికీ అంధులు కృతజ్ఞతలు తెలిపారు.
